Saturday, April 22, 2017

నేల మాట

నెఱియ బారిన నేల చూస్తే
వ్రయ్యలైన పిపాసిని తలపిస్తే
నఱవ లన్నీ నేల విడిచి
వాగులై వరదలై ఏరులై
కడలివైపే పరుగులు తీస్తే
ఆర్ద్రతంతా ఇంకిపోయిన గుండెతో
నీటిచేతిలో తడిసి ముద్దై పరవసించిన
మృదు మధుర గత స్మృతులతో
దీనాతి దీనంగా నింగికేసి చూసి
ఎదపరచి విలపిస్తోందా నేల పిల్ల.
'స్నపయ కృపయా' అంటూ రోదిస్తోంది
పంటకుంటలో నేల బావులో
జాలి గుండెతో ఆదుకోవా
మొయిలు చెలియలు నేల చూపులు చూడవా
తొలకరి చిరుజల్లొక్కటి దాహార్తిని తీర్చదా
పగిలిన గుండెల నతికే భిషగ్వర వరుణుడు
కరుణించేదెపుడో సరి జేసేదెపుడో
నీతి మాలిన జాతి హీనుల మనుజుల
ఊడిగంలో ఈసడింపులో ద్వేషంలో
బ్రతికి మెతుకు లిచ్చేకన్నా
నీట మునిగి పోవటమే మిన్న.
(నెఱియ= నేల బీటలు
నఱవ= పొలంలో పారిన నీటి వాగు)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home