Saturday, April 15, 2017

వందనాలు

శిశిరంలో మోడైపోయిన వృక్షంలా
ఆకులన్నీ రాలిపోయిన అపర్ణలా
ప్రతి తలపూ వసివాడి పోతోంది
ప్రతి పిలుపు  కసుగంది పోతోంది
ఎటు చూసినా అంతా అసూయలే
మచ్చుకైనా అగుపించదు అనసూయ
ఆపాద మస్తకం అహంభావమే
అణువణువూ అహంకార మే
నిర్లక్ష్యపు నీలి నీడల మాటున
దుర్మార్గపు కక్షసాధింపుల నీడన
ఔనన్న ప్రతిదీ కాదనే కుత్సితులను
కాపలా కాస్తావా నాకెందుకని గాలికి వదిలేస్తావా
ఋజువర్తనలకు నిర్ద్వంద్వంగా మళ్ళిస్తావా
మాను మళ్ళా చిగురిస్తుంది
బీడు మళ్ళీ మొలకేస్తుంది కదా
శిశిరం వెనకే వసంతం రాదా
మానుకైనా మనిషికైనా ఒకటేకాదా
అనుకుంటారా అని అనుభవిస్తారా
ఓసారి వసివాడి నలిగినా పరవాలేదా
ఓచేయి నూతన మర్యాద పొందితే తప్పు కాదా
మనువుకు ముందే చనువులు ఒప్పుకోగలవా
కాదని ఎవరిని శాశించ గలవు
వలదని ఎవరిని నిలదీయ గలవు
ఆత్మ సాక్షి లేని అహంభావులకు
నీతిమాలి గోతిలో దూకే జీవులకు
వందనాలు వేనవేల అభివందనాలు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home