Tuesday, November 20, 2018

మధుర స్మృతులు


ఈ సిత శీత శరత్ చంద్రికలలో
నిండు పున్నమి నిశరాత్రి ఒంటరినై
గుండె లవిసి ఏకాంతంలో తెంపరినై
కడలి అలల కలల వీక్షణాతురుడనై
ఇసుక తిన్నెలపై అయోమయంగా
ఆశయ సాధనల కనునయంగా
తిలకిస్తూ తలపోస్తూ తపిస్తూ జపిస్తూ
నన్ను నేనే నిష్కర్షగా విమర్శించుకుంటూ
ఎదలో గాయాలను పరామర్శించుకుంటూ
మందస్మిత మలయ మారుత స్పర్శతో
కుందన్మయ నిలయ ధీరత్వపు టూహలతో
సుందర ఫేన తరంగపు అంతరంగంతో
వీచీ బాలికలతో మరీచికలతో సైకత రేణువులతో
ఎడద పరచి విడమరచి విలపించిన
ఆదమరచి మది తెరచి వినిపించిన
నా ఆక్రందనలెన్నో అశ్రుబిందువులెన్నో
కడలి కెరటాల మృదు వచో పలుకరింపుల
ఓదార్పుల కావల పిడికిలి బిగించి
కర్తవ్యతా దీక్షతో నడుం బిగించి
మరో పోరాటానికి బావుటా నెగరేసిన
మధుర స్మృతులెన్నో ఎన్నెన్నో
సాగర తీరం చూస్తే నెమరుకు వస్తాయ్
సుందర రామంగా ముందుకు నడిపిస్తాయ్.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home