Thursday, July 22, 2021

మనసు మూగబోతోంది

 

మనసు మూగబోతోంది

ఆలోచనలు తెగక

మాటలు పెగలక

వేదనలు వాదనలు చల్లారక

ఆవేదనలు ఆకాంక్షలు తీరక

నా మనసు మూగబోతోంది.

కట్టెదుట జరిగేవన్నీ కల్లలని నమ్మలేక

నిర్భయంగా నిజాన్ని పలుకలేక

నిర్ద్వంద్వంగా చెబితే వచ్చే పర్యవసానాలు భరించలేక

నిరంకుశ దురహంకారాలకు తలొగ్గలేక

న్యాయం కోసం నిలదీసే దమ్ములేక

నా మనసు మూగబోతోంది.

ఎంత సాగినా తీరం చేరని నావతో

ఎంత జేసినా కనికరించని కాలంతో

మరణానికి చేరువ కాలేక వెరపేలేక

నిమిత్తానిచ పశ్యామి యని ఉండలేక

ఇదమథ్థమని తేల్చుకోలేక 

ఈ జీవన మింతే యనుకోలేక

ముక్కుతూ మూలుగుతూ

సరిపెట్టుకోలేక సాహసించలేక

నా మనసు మూగబోతోంది.

కాలానికి ఎదురేగలేక

కాలంతో సహగమించలేక

అవాంతరాలను అధిగమించలేక

 అభ్యంతరాలకు తలవంచుకోలేక

కిమన్నాస్తి యని కూర్చోలేక

ఓర్చుకోలేక ఓడిపోలేక

నా మనసు మూగబోతోంది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home