Friday, May 4, 2018

జన్మదినాన

ఆగిపోనిదీ ఆపలేనిదీ  అలుపెరుగనిదీ కాలగమనం
నచ్చుకున్నా నొచ్చుకున్నా సాగిపోయే చంక్రమణం
నభోవీథిలో నిశ్చలంగా ఉన్నా భ్రమపెట్టే పరిభ్రమణం
తనచుట్టూ గ్రహ మండలాలను త్రిప్పుకొనే వైనం
కాలానికీ ఆదిత్యునికీ అవినాభావ సంబంధం
ఏది ముందో ఏది వెనుకో తెలియని తికమక
విశ్వ సృష్టికి ముందున్న పెంజీకటి కావల
మిణుకుమిణుకు మంటూ వెలిగిన వెలుగే
పరంజ్యోతి అన్నా  అణు విస్ఫోటనమన్నా
మరి దానికీ సృష్ట్యానంతర సూర్యునికీ కాలానికీ
సంబంధం ఏముందో మరి ఆ వెలుగేమైందో
రోదశీ వింతల నెట్లా అవలోకించారో మన పూర్వులు
మానవ మేథకు అవధి లేని ఆవిష్కరణలు
నా కైతే తెలుసుకునే పిపాసే ఉంది కాని
ఆ జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం ఆమడ దూరం
అరువది నాలుగు నిండిన జన్మదినాన
నాలో ఎందుకో ఈ అంతర్మథనం
ఎవరిని ఆ చేరువలో నిలపాలో
ఆలోచనలే అవకాశం గా మలచాలో
అంతా ఈశ్వరేచ్ఛ! మనసంతా అమ్మకే ఇచ్చా
నిస్స్వార్థంగా ఏ పనికైనా సంసిద్ధం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home