అక్షర వ్యథ
అక్షర వ్యథ
గుండు సున్నాలో పుట్టా నిండు పున్నమిలా ఎదిగా
గుండె నిండా సవ్వడిని మనసు నిండిన ఊహలను
సునిశితంగా విస్పష్టంగా వెలిబుచ్చడానికి వెలువరించడానికి
విధేయంగా వినమ్రంగా ఎభైయ్యారు అవతారాలెత్తా.
వాక్ప్రవాహంలో వరదనై వెల్లువై ఉరకలేస్తుంటే గోదావరొడ్డున
రాణ్మహేన్ద్రిలో కోటిలింగాల రేవులో అవభ్రుధ స్నానం చేయించాడా నన్నయ్య
ఆతరువాత తంజపురిలో కొన్నాళ్ళకు ఏవనితల్ మముం దలుప నేమిపనో
అంటూ నిలదీసే ధైర్యాన్నిచ్చి ముందుకొచ్చింది .
పద్యమై హృద్యమై గద్యమై కావ్యమై కమనీయ సాహిత్యమై శ్రావ్యమై
రసరమ్య గీతమై ఎదిగిన ఆంద్ర భారతికి
చెంగావి రంగు సరిగంచు చీరలా భాసిల్లా
నెన్నుదుట కుంకుమ బొట్టునై ప్రకాసించా.
ఇప్పటి ఈ నాయకమ్మన్యుల్లా కాదు తంజపురి నాయక రాజులు
బంగారు కామాక్షి సాక్షిగా సరస్వతీ మహలులో అగ్రాసనం వేసారు.
శ్రీకాకుళాంధ్ర దేవుని ఆనగా సాహితీ సార్వభౌముడు
విజయ నగర కృష్ణ దేవ రాయలు అముక్త మాల్యదలల్లాడు
అష్ట దిగ్గజాలతో భువన విజయం చిరస్మరణీయంగా అందించాడు .
కడపనే నాకొక గడపగా చేసి తాటాకుల ఇబ్బందుల తాళలేక
కాగితాలపై అచ్చొత్తించాడా బ్రౌన్దొర అచ్చతెలుగు బిడ్డలా.
ఇంతలో
కాకెత్తుకు పోయిందో ఏమైందో కనబడకుండా పోయింది
వెలపల గిలక ఓ రామచిలక.
దంత్య చజలు పలుకలేక చప్పరించేసాడొకడు
ఆలు అలూ లను గుప్తంగా లుప్తం చేసాడింకొకడు.
ఋఋఱలను నోరారా పలుకలేక చేతులారా తిప్పలేక
గోదాట్లో పారేసాడో పారేసాడో సత్తెకాలపు సత్తిగాడు.
ఇప్పుడు
ఓ వంకరి టింకరి 'ఓ' గాడి ఏ బీ సీ దాడికి అల్లల్లాడుతున్నా
ళ శ లను మింగేస్తాడేమో ముదనష్టపు ముష్టిగాడు .
అయినా
నిమ్మళంగా సమ్మాళి0చుకు విరుచుకు పడతా విజృమ్భిస్తా
నాగమల్లెలా నాజూకుగా కనిపిస్తూ తీగామల్లెలా లేలేతగా విరబూస్తూ.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home